పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదు: పౌరసరఫరాలశాఖ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ (State Civil Supplies Department) స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని హెచ్చరించింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని ప్రకటించింది. ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వదంతుల వల్లే ఫిల్లింగ్‌ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగాయని.. ప్రజలు భయపడి అకస్మాత్తుగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది.

అటు తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా ఇంధన కొరత లేదని ప్రకటించింది. హెచ్‌పీసీఎల్ (HPCL), ఐవోసీఎల్ (IOCL), పీబీసీఎల్ (PBCL) వద్ద తగినంత స్టాక్ ఉందని స్పష్టం చేసింది. ఇంధన కొరత ఉందన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఇంధనం దొరకదనే భయంతో బంకుల వద్ద క్యూ కడుతున్నారని పేర్కొంది. ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ వివరించింది. హిందూస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థ కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ప్రకటించింది. ప్రజలెవరూ భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లవద్దని హెచ్‌పీసీఎల్ విజ్ఞప్తి చేసింది. సాధారణ అవసరాలకు అనుగుణంగా ఇంధనం నింపుకోవాలని పేర్కొంది. ఇంధన సరఫరా సక్రమంగా ఉంచేందుకు హెచ్‌పీసీఎల్ కట్టుబడి ఉందని వెల్లడించింది.

రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో మ.2 గం.కు అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. పెట్రోల్‌, గ్యాస్ కొరత తలెత్తకుండా జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నారు.

ఇంధన కొరతతో హైదరాబాద్‌ మహానగరంలోని పెట్రోల్‌ బంకుల వద్ద భారీగా వాహనాల బారులు తీరారు. నగరంలోని కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అబిడ్స్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది. బంకుల వద్ద గంటల తరబడి వాహనదారులు వేచి చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారుల విజ్ఞప్తి చేశారు. యుద్ధం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ దొరకట్లేదనే వదంతులతో వాహనదారులు భారీగా బారులు తీరారు. అటు హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై బంకుల్లో భారీగా వాహనాలు బారులు తీరాయి. జాతీయరహదారిపై పెట్రోల్‌ బంకులు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>