Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి: కాంగ్రెస్‌లోకి భారీ వలసలు.. బీఆర్ఎస్‌లో ముసలం!

కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడి ఓటరు తీర్పు ఎల్లప్పుడూ రాష్ట్ర ట్రెండ్‌కు భిన్నంగా, అత్యంత వ్యూహాత్మకంగా ఉంటుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Politics) ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకున్న రెండు భిన్నమైన పరిణామాలు రాబోయే కాలంలో జిల్లా రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేయబోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీలోకి రికార్డు స్థాయిలో వలసలు సాగుతుండగా, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) అంతర్గత విభేదాలతో రోడ్డుకెక్కడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

​రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల వేదికగా భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఒకే రోజు 600 మందికి పైగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరడం సామాన్యమైన విషయం కాదు. ​ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ వలసలు కేవలం సాధారణ కార్యకర్తలకు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న కన్నాయిగూడెం ఇండిపెండెంట్ సర్పంచ్ కల్తీ విజయ్, ఉపసర్పంచ్ స్వర్ణలత, నలుగురు వార్డు సభ్యులతో పాటు సీనియర్ టీడీపీ నేతలు అధికార పార్టీ వైపు అడుగులు వేశారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో సాగిన ఈ ఆపరేషన్ ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలను తీవ్రమైన ఆత్మరక్షణలోకి నెట్టేసింది. క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా అవతరించాలనే కాంగ్రెస్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

​బీఆర్ఎస్‌లో ముసలం!

​కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పొలిటికల్ జోష్ కనిపిస్తుంటే, దానికి పూర్తి భిన్నంగా బీఆర్ఎస్ శిబిరంలో తీవ్ర అసంతృప్తి, అంతర్గత పోరు బహిర్గతమైంది. నిన్న కొత్తగూడెం క్లబ్‌లో ఓటర్ల జాబితా సవరణ, సభ్యత్వ నమోదు వంటి పార్టీ బలోపేత కార్యక్రమం కోసం సమావేశమై, చివరకు కుర్చీలు విరగ్గొట్టుకునే స్థాయికి చేరడం గులాబీ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చేసిన “పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారు పార్టీని వీడాలి” అనే ఒక్క వ్యాఖ్య కొత్తగూడెం బీఆర్ఎస్‌లో ఎంతటి అంతర్గత అగాధ ఉందో స్పష్టం చేసింది.

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు తనయుడు రాఘవ సమావేశం నుండి వాకౌట్ చేయడం, ఆ తర్వాత ఆయన వర్గీయులు భౌతిక దాడులకు దిగడం చూస్తుంటే నియోజకవర్గంలో పాత, కొత్త నాయకత్వాల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని అర్థమవుతోంది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సకాలంలో జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయగలిగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

​ఘటన జరిగిన వెంటనే గొడవకు కారకుడైన బూత్ కోఆర్డినేటర్ ఎండి అక్బర్ (గాంధీ)పై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. “పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోం” అని రవీందర్ రావు గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇది తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. క్షేత్రస్థాయిలో గ్రూపు రాజకీయాలను అణచివేయడంలో విఫలమైతే, క్యాడర్ మరింత నిరాశకు గురై పక్క పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఈ ఘటన ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి చేరినట్లయింది.

​ఒకవైపు అధికార బలం, సంక్షేమ పథకాల అండతో దూసుకుపోతున్న కాంగ్రెస్.. మరోవైపు అంతర్గత అసమ్మతి, సమన్వయ లోపంతో సతమతమవుతున్న బీఆర్ఎస్. భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒకే రోజు చోటుచేసుకున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఏ పార్టీ పట్టు సాధించబోతుందనే దానికి ఒక దిక్సూచిగా మారాయి. ‘కారు’ పార్టీ తన ఇంజిన్ లోపాలను సరిదిద్దుకుంటుందా, లేక ‘హస్తం’ తన వేగాన్ని మరింత పెంచి ఏజెన్సీని పూర్తిగా తన వశం చేసుకుంటుందా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>