కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల (Nominated Posts) భర్తీ ఆలస్యమవుతుండటంతో క్యాడర్ (Congress Cadre) లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కీలక పదవులు, పార్టీ కార్యవర్గాలు పూర్తిగా ప్రకటించకపోవడం కార్యకర్తల్లో నిరాశను మిగిల్చింది. పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా స్పష్టత రాకపోవడంతో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో డీసీసీ కార్యవర్గాలు ఇప్పటికీ పూర్తి కాకపోవడం.. గ్రూపు విభేదాలే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు బీఆర్‌ఎస్‌తో పోరాటం చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మార్చి 15 తర్వాత అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా ముందుకు సాగకపోవడంతో ఆశలు తగ్గుతున్నాయి. జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది గ్రంథాలయ చైర్మన్లు, మార్కెట్ కమిటీ పాలకవర్గాలుగా నియమించబడినా, అనేక కీలక పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, జిల్లా స్థాయి నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం విమర్శలకు కారణమవుతోంది. పార్టీ మూడు వర్గాలుగా విడిపోయి, ప్రతి వర్గం వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సుడా చైర్మన్, లైబ్రరీ సంస్థలు, దేవాలయ కమిటీలు వంటి అనేక నామినేటెడ్ పదవులు ఇంకా భర్తీకి నోచుకోలేదు. దాదాపు 50 మందికి పైగా కార్యకర్తలు వివిధ స్థాయిల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీకి సంవత్సరాలుగా సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, ఇప్పటికైనా అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కరీంనగర్ కాంగ్రెస్ (Karimnagar Congress) శ్రేణులు కోరుతున్నాయి.
Read Also: రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల పనులు వేగవంతం.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
Follow Us On: Sharechat

