కలం, వెబ్ డెస్క్ : రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని.. అందుకే ‘చార్ సౌ పార్’ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం మార్పుతో పాటు, రిజర్వేషన్లు తొలగించాలని భావించిందని కానీ ప్రజలు 240 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై ఆయన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ మరోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కలిసి ఓడించాయన్నారు. బిల్లులు వీగిపోవడం కేవలం కేంద్రంలోని అధికార పార్టీ ఓటమే కాదని, బీజేపి చిత్తశుద్ది అని చెప్పారు. మోదీకి చిత్తశుద్ది లేనందునే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందన్నారు.
లోక్ సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని రేవంత్ (CM Revanth Reddy) సూచించారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో (INDIA) కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు (Delimitation) అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణులతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలనిన్నారు. రాష్ట్రాలను సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ బద్నాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఓడిపోయింది మోదీ అహంకారం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని.. కానీ, బీజేపీకి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని రేవంత్ దుయ్యబట్టారు. ఉత్తర, దక్షిణాది మధ్య అంతరాలు సృష్టించి అడ్డుగోడలు పెట్టొదని హితవు పలికారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని.. దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లపై (Women Reservation) కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ది ఏమిటో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజననే మాత్రమేనని.. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు డీలిమిటేషన్ తో రాజకీయంగా దెబ్బపడుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై మోదీ ద్వేషం చూపారని.. ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య నడుస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.
కాంగ్రెస్‌తోనే మహిళా సాధికారిత..
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని.. కాంగ్రెస్ తోనే మహిళా సాధికారత సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని గుర్తు చేశారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రులను, లోక్‌సభ స్పీకర్, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సీఎం గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని… ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి చేరుకుందని గుర్తు చేశారు. మహిళకు అధ్యక్ష పదవి ఇవ్వలేని బీజేపీ మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: భవిష్యత్తులో సీఎస్‌కే కెప్టెన్‌గా సంజూ శాంసన్: అశ్విన్
Follow Us On : WhatsApp

