కలం, వెబ్ డెస్క్: నేటి కార్పొరేట్ సంస్కృతిలో టీ కల్చర్ ఒక భాగమైపోయింది. చాలా మంది ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఓ కప్పు టీ తాగనిదే తమ రోజును ప్రారంభించరు. కేవలం నిద్ర మత్తును వదిలించుకోవడానికి కాకుండా.. ఆఫీస్ పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి, స్నేహితులు కలిసినప్పుడు ఇలా రోజుకు ఐదు నుంచి ఆరు సార్లు టీ తాగేవారు చాలామంది ఉన్నారు. టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తాగే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే టీ తాగేటప్పుడు కొన్ని తప్పులు (Tea Drinking Mistakes) చేయకూడదని సూచిస్తున్నారు.
టీ తాగడం వలన మన శరీరానిరి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కానీ అది పరిమితంగా తాగినప్పుడు మాత్రమే. ప్రస్తుత కాలంలో నిద్ర లేచిన దగ్గరినుంచి అనేక సందర్భాల్లో చాలా మంది టీ తాగుతుంటారు. కొందరైతే రాత్రి పడుకునే ముందు కూడా టీ తాగుతారు. టీని ఎక్కువ సార్లు తాగడం, సరికాని సమయంలో తాగడం వలన చాలా సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట, అసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
టీ లో ఉండే కెఫిన్ అనే పదార్ధం కడుపులో ఆమ్లాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. టీ ని ఎక్కువసార్లు తాగడం వలన అన్నవాహిక మధ్య ఉండే కండరం బలహీనపడుతుంది. దీంతో కడుపులోని ఆమ్లం పైకి వచ్చి అసిడిటీ, గుండెల్లో మంటకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం లేదా రోజంతా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
పొగలు కక్కే టీ వద్దు!
చాలామంది విపరీతమైన వేడితో పొగలు కక్కే టీని తాగేస్తుంటారు. దీనివల్ల అన్నవాహిక దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అంతే కాకుండా ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మరీ వేడి టీ కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తాగడం మంచిదట.
టీ బ్యాగులను నివారించాలి
ఇటీవలి కాలంలో మన జీవనశైలిలో టీ బ్యాగుల వినియోగం బాగా పెరిగింది. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో సులభంగా తయారు చేసుకోవడానికి చాలామంది వీటిని వాడుతుంటారు. అయితే ప్లాస్టిక్ పూత ఉండే టీ బ్యాగులను వేడి నీటిలో వేయడం వల్ల సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు టీలో కలిసే అవకాశం ఉంటుంది. ఇది మన శరీరంలో హార్మోన్ల సమస్య, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీ వల్ల రక్తహీనత వచ్చే అవకాశం
చాలా మంది భోజనం తర్వాత కూడా టీ తాగుతుంటారు. సాధారణంగా టీలో టానిన్లు, పాలిఫెనాల్స్ అనే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం ఐరన్ ను శోషించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే భోజనం తర్వాత లేదా భోజనంతో పాటు టీ తాగడం వలన శరీరానికి అందాల్సిన ఐరన్ అందకుండా పోతుంది. దీనివల్ల ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.
రాత్రిపూట టీ తాగొచ్చా?
రాత్రి వేళల్లో టీ తాగడం వల్ల నిద్ర నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. టీలో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచి, గాఢ నిద్ర పట్టకుండా చేస్తుంది. ఫలితంగా మరుసటి రోజు ఉదయం అలసటగా, నీరసంగా అనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే రాత్రి పూట సాధారణ టీకి బదులుగా.. కెఫిన్ లేని హెర్బల్ టీలు, లేదా గోరువెచ్చని పాలు వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
టీ తాగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
- రోజుకు 2 నుంచి 3 కప్పుల టీ మాత్రమే తాగాలి
- ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని తగ్గించాలి. దానికి బదులుగా టీ ఆకులతో తయారు చేసిన టీ తాగాలి.
- వేడి వేడి టీ కాకుండా కాస్త చల్లారిన టీ తాగాలి
- ఖాళీ కడుపుతో, భోజనానికి తర్వాత, రాత్రిపూట టీ తాగే అలవాటును మానుకోవాలి
ఇలా తగిన జాగ్రత్తలతో టీ తాగినప్పుడే దానివల్ల కలిగే అసలైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

