కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ప్రయాణికుల టైమ్ ను మరింత సేవ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో ఎదురు కామన్ మొబిలిటీ కార్డు (Common Mobility Card) రాబోతోంది. ఈ కార్డుతో టికెట్ లేకుండానే స్కాన్ చేస్తూ జర్నీలు చేయొచ్చు. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ కసరత్తులు స్టార్ట్ చేసింది. రీసెంట్ గానే ఈ మూడు ట్రాన్స్ పోర్టులకు చెందిన ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ కామన్ మొబిలిటీ కార్డు ఎలా ఉండాలి, మూడు ట్రాన్స్ పోర్టుల్లో దాన్ని వాడుకునేలా ఎలా డిజైన్ చేయాలనే దానిపై చర్చించారు. త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో ప్రధాన ప్రయాణ వ్యవస్థలైన మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలనే ప్రజలు వాడుతున్నారు. ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండగా.. మెట్రో ప్రత్యేక కార్పొరేషన్ చేతుల్లో ఉంది. అటు కేంద్రం ఆధ్వర్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజూ లక్షల మంది ఈ మూడు ట్రాన్స్ పోర్టు సేవలను వాడుతున్నారు. దూర ప్రాంతాలు జర్నీ చేసేవాళ్లు ఎంఎంటీఎస్ రైళ్లు, కొద్దిదూరం వచ్చాక మళ్లీ మెట్రో ఎక్కి అక్కడి నుంచి వాళ్ల ఆఫీసులు లేదా ఇండ్లకు చేరుకోడానికి ఆర్టీసీ బస్ ఎక్కుతుంటారు. మూడు సార్లు వాళ్లు టికెట్లు తీసుకోడానికి టైమ్ కేటాయిస్తున్నారు. ఈ కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులోకి వస్తే ఈ మూడింటిలోనూ ఆ కార్డుతో స్కాన్ చేసి టికెట్లు లేకుండానే జర్నీ చేసేయొచ్చు. ఆయా ట్రాన్స్ పోర్టుల్లో స్కాన్ చేసినప్పుడు ఆ టికెట్ ఛార్జీలు ఆటోమేటిక్ గా ఈ కార్డు నుంచి కట్ అయిపోతాయి.
ప్రతిరోజూ హైదరాబాద్ లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.15 గంటల దాకా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మెట్రోలో యావరేజ్ గా 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగరంలో 3200 ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ సేవలందిస్తున్నాయి. ఇందులో 24 లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. 76 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తుండగా.. ఇందులో 32వేల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. నగర ప్రజలు తమ జర్నీల కోసం మెట్రోతో పాటు బస్సులు ఎక్కుతున్న వారు కొందరు ఉంటే.. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులను వాడుతున్న వారు ఇంకొందరు ఉన్నారు. ఇక మూడింటినీ వాడుతున్న వారు కూడా వేలాది మంది ఉన్నారు.
కామన్ మొబిలిటీ కార్డు (Common Mobility Card) అందుబాటులోకి వస్తే టికెట్ తీసుకునే టైమ్ తగ్గడంతో పాటు జర్నీ ఈజీ అయిపోతుంది. రైల్వే, మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్ల ముందు నిలబడకుండా కార్డు స్కాన్ చేసి డైరెక్ట్ ప్లాట్ ఫామ్ వద్దకు వెళ్లిపోవచ్చు. పైగా ప్రతిసారి ప్రయాణానికి సరిపడా చిల్లర వాళ్ల చేతుల్లో ఉండదు కాబట్టి ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. హైదరాబాద్ లో గతంలో ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ను అనుసంధానం చేస్తూ ఒక పాస్ తీసుకొచ్చారు.
ఈ పాస్ లతో అటు ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు బస్సుల్లోనూ ప్రయాణం చేయొచ్చు. గతంలో నెలకు రూ.800 ఉన్న ఈ పాస్ ధర ప్రస్తుతం రూ.1350కి చేరింది. దీన్ని తీసుకోవాలన్నా, రెన్యూవల్ చేసుకోవాలన్నా ప్రతి నెలా సంబంధి ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సిందే. కానీ కామన్ మొబిలిటీ కార్డు వస్తే ఆటోమేటిక్ గా మన ఫోన్ నుంచే రీఛార్జ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు అందుబాటులో ఉన్నాయి.
ఈ నేషనల్ మొబిలిటీ కార్డులు అన్ని నగరాల్లో పనిచేయాలి గానీ.. హైదరాబాద్ లో మాత్రం పనిచేయట్లేదు. కాబట్టి ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ కామన్ మొబిలిటీ కార్డులను తీసుకొస్తే.. అప్పుడు నేషనల్ మొబిలిటీ కార్డులు కూడా ఇక్కడ యాక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On : WhatsApp


