ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్ రిజ్వాన్

కలం, ‌జోగులాంబ గద్వాల: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని 16వ వార్డు పరిధిలో భీమ్ నగర్ ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ బీమా పథకం నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాల నమోదు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ మేలు జరిగేలా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో బీమా కూడా ముఖ్యమైనదని తెలిపారు. ఇంటి యజమాని ఆకస్మికంగా మృతి చెందితే ఆయా కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అందజేసి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

సర్వర్ సమస్య లేకుండా పరిష్కరించాలి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తులను నమోదు చేసేందుకు సర్వర్ సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఈడీఎం శివను ఆదేశించారు. పథకం నమోదుకు ప్రజలు తమ ఆధార్, రేషన్ కార్డును సమీప శిబిరం వద్దకు తీసుకురావాలని సూచించారు. సంబంధిత అధికారులు వివరాలను నమోదు చేస్తారని, ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్స్ వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వివరాలు నమోదు చేశాక లబ్ధిదారుల ఫోన్లకు మెసేజ్ వస్తుందని తెలిపారు. నామినీలుగా ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా సూచించేందుకు అవకాశం ఉందన్నారు. శిబిరాల వద్ద ప్రజలు ఎక్కువ సేపు నిరీక్షించే పరిస్థితి ఉండరాదని, ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి పంపాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేదవతి, వార్డు అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>