కలం, మునుగోడు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు రేవల్లి యాదయ్య (Revalli Yadaiah) డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచడంతో పాటు, పెన్షన్ను పెంచి అమలు చేయాలని ఆయన కోరారు. ఈ డిమాండ్ల కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ‘ఆక్యుపై ఢిల్లీ–ఛలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రేవల్లి యాదయ్య పిలుపునిచ్చారు.
బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులు తమ శ్రమతో సంపదను సృష్టిస్తుంటే, యజమానులు ఆ సంపదను కొల్లగొట్టి కుబేరులుగా మారుతున్నారని విమర్శించారు. పాలకవర్గాలకు కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు.
ఈ విధానాల వల్ల కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని విధానం, సమ్మె చేసే హక్కుకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది కార్మికులను కార్మిక చట్టాల రక్షణకు దూరం చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం రూ.42 వేలకు పెంపు, పెన్షన్ పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత తదితర డిమాండ్ల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఏదుళ్ల సునీత, జిల్లా కమిటీ సభ్యురాలు కోరే లలిత, బుషిపాక నీలిమ, బిక్షం, సత్తయ్య, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

