కలం, వెబ్‌డెస్క్: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పైప్‌లైన్‌కు నష్టం కలిగించేలా తవ్వకాలు చేపట్టడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇటీవల సోషల్ మీడియాతో పాటు పలు వార్తా పత్రికల్లో కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొందరు ఇసుకాసురులు అక్రమంగా తవ్వకాలు చేపట్టడమే కాకుండా తాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్థానికంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించవద్దన్నారు.
ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి వద్ద ఇసుక తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించారని కలెక్టర్ తెలిపారు. అధికారులు అక్రమ తవ్వకాలను, ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారన్నారు. ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్లు, వాటి యజమానులు, ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు. తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన నిందితులు, ట్రాక్టర్ యజమానులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశామన్నారు. దెబ్బతిన్న పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించామని కలెక్టర్ వివరించారు.

