కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న టైలర్స్ కాలనీ, పోలీస్ కాలనీల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మురుగునీటి కాలువలు సరిగా లేకపోవడంతో నీరు ఇళ్ల మధ్యలోనే నిలిచిపోతోందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా మొత్తం రూ.2.80 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ వెల్లడించారు. 14వ వార్డులోని టైలర్స్ కాలనీ, పోలీస్ కాలనీల్లో సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.1 కోటి, అలాగే వార్డు పరిధిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి మరో రూ.1.80 కోట్లు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియ కారణంగా కొంత జాప్యం జరిగిందని, వెంటనే డ్రైనేజీ లెవెల్స్‌ను సరిచూసుకుంటూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా పకడ్బందీగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్షేత్ర పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మావల తహసిల్దార్ వేణు, స్థానిక కౌన్సిలర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

