కలం, వెబ్ డెస్క్: రెండు తుఫాన్లు వెంటవెంటనే రావడం చరిత్రలో ఇదే మొదటిసారని.. దీంతో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. పంట చేతికొచ్చే సమయానికి వచ్చిన అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు రకరకాలుగా పంటలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు అందించామని.. కానీ, తుఫాన్లు కోలుకోలేని దెబ్బతీశాయన్నారు. రైతులు అధైర్యపడొద్దని, వారికి పంట నష్ట పరిహారం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బాపట్ల జిల్లా రేటూరులో నష్టపోయిన పంట పొలాలను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు.
పంటల బీమాపై అవగాహన రావాలి..
పంటల బీమాపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇలాంటి విపత్తుల సమయంలో బీమా ఉంటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆక్వా రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని త్వరలోనే తొలగించి.. ప్రజలు సాధారణ జీవనం గడిపేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల సహకారంతో విద్యుత్తు పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రతలతోనే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం తప్పిందన్నారు. పంట నష్టం అంచనాలు పూర్తిగా అందాక.. ఎకరాకు ఎంత మేరకు నష్టం ఇస్తాయనేది ప్రకటిస్తామన్నారు.

