కలం, ఉట్నూర్: గిరిజన యువత (Tribal Youth) పట్టుదలతో చదివి పోలీసు ఉద్యోగాలను (Police Jobs) సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షల అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రాజెక్టు అధికారి మంద మకరందు, ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్‌తో కలిసి ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సరైన మార్గదర్శకత్వం, నిత్యం ప్రాక్టీస్ చేయడం ఎంతో కీలకమని తెలిపారు. అభ్యర్థులు తమ బలహీనతలను గుర్తించి, నిపుణుల సహాయంతో వాటిని అధిగమించాలని సూచించారు. డిసెంబర్ 20 నాటికి జరగబోయే పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున, అభ్యర్థులు పరీక్షా విధానం, ప్రశ్నపత్రం సరళి, సిలబస్, మార్కుల విభజనపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ చదువును ఎలా కొనసాగించాలి, గత ప్రశ్నపత్రాలను ఎలా సాధన చేయాలి అనే అంశాలపై విలువైన సూచనలు చేశారు.
అభ్యర్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించాలని, అందుబాటులో ఉన్న శిక్షణా వనరులను సద్వినియోగం చేసుకొని గిరిజన యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కలెక్టర్, ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఆ తర్వాత వైటీసీలోని కంప్యూటర్ ల్యాబ్‌లను కలెక్టర్ పరిశీలించి, విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు.

