కలం, నారాయణపేట: టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు సరైన వైద్య చికిత్స అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యమన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం నిర్వహించారు.
నారాయణపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఆధ్వర్యంలో పీహెచ్సీలు, ఎంపీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలోనూ పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
54,684 మందికి పరీక్షలు..
నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 54,684 మందికి ఛాతీ పరీక్షలు, ఎక్స్రే స్క్రీనింగ్ నిర్వహించినట్లు కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ప్రత్యేకంగా ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులను గుర్తించి, వారికి తప్పనిసరిగా టీబీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వంద శాతం స్క్రీనింగ్ పూర్తి చేసి, టీబీ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో అవసరమైన వాలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు టీబీపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలకు పంపించాలని సూచించారు. సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

