కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ, తక్కువ నీటితో సాగు చేయగల పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) సూచించారు. భూత్పూర్ మండలం రైతు వేదికలో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో కోరమాండల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన గ్రోమోర్ నానో ఎరువుల అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తీరు పూర్తిగా మారిపోయిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారి వర్షాలు ఆశించినంతగా లేవని అన్నారు. అందువల్ల సంప్రదాయ పంటల సాగులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని చెప్పారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులు (Mahabubnagar Farmers) పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి రైతును వ్యక్తిగతంగా కలుసుకోవాలి..
వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) గ్రామస్థాయికి వెళ్లి ప్రతి రైతును వ్యక్తిగతంగా కలుసుకుని వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. రైతులకు వ్యవసాయంపై మంచి అనుభవం ఉన్నప్పటికీ, కొత్త పంటల సాగు, మార్కెట్ అవకాశాలు, లాభదాయకత, నేల సారంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసి వారికి ధైర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.
చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఒకేసారి మొత్తం భూమిలో పంట మార్పు చేయకుండా కొంత విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు, నానో యూరియా వంటి ఆధునిక సాంకేతికతలను రైతులకు పరిచయం చేసి వాటి ప్రయోజనాలను వివరించాలని అన్నారు.
రైతుల అనుభవాలను పంచుకునేలా వేదికలు..
వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించడం, పోస్టర్లు ప్రదర్శించడం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక రైతు సాధించిన విజయాన్ని ఇతర రైతులకు చూపించడం ద్వారా మరింత విశ్వాసం ఏర్పడుతుందని, రైతు వేదికలను విజయవంతమైన రైతుల అనుభవాలను పంచుకునే వేదికలుగా ఉపయోగించాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ డ్రోన్లు, నానో ఎరువులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తమ నైపుణ్యాన్ని వినియోగించాలని సూచించారు.
యూట్యూబ్ వంటి వేదికల్లో అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు చేరవేసే వారధిగా వ్యవసాయ అధికారులు వ్యవహరించాలని అన్నారు. గ్రామాల్లో పంటల పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా నమోదు చేసి రైతులకు చూపించడం ద్వారా వారు కొత్త పద్ధతులను సులభంగా అర్థం చేసుకుంటారని చెప్పారు.
మహబూబ్నగర్ వ్యవసాయాధారిత జిల్లా..
మహబూబ్నగర్ జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లా అని, రైతుల అభివృద్ధే జిల్లా అభివృద్ధికి పునాదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఏఈఓ కనీసం ఐదుగురు రైతులను ఎంపిక చేసుకుని కంటింజెన్సీ ప్రణాళికలో భాగంగా అమలు చేసిన చర్యల ఫలితాలను నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే వినూత్న కార్యక్రమాలు చేపట్టిన క్షేత్రస్థాయి అధికారులను జిల్లా స్థాయిలో అభినందించి, అవసరమైతే తాను స్వయంగా ఆయా గ్రామాలను సందర్శిస్తానని తెలిపారు.
వ్యవసాయ అధికారుల అసలు బాధ్యత రైతుల మధ్య ఉండి వారికి మార్గదర్శకత్వం వహించడం, అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతికతలను పరిచయం చేయడం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అధికారి గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ కంటింజెన్సీ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్, మండల స్థాయి వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

