కలం, వెబ్డెస్క్: దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు (COVID Cases) పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపిందని వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు తదితర నిపుణుల సంస్థల అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల పెరుగుదల, గతేడాది ఇదే సమయంలో కనిపించిన ధోరణికి కాస్త దగ్గరగా ఉన్నట్లు తెలిపింది.
ప్రస్తుతం వ్యాధి తీవ్రత పెరిగినట్లు లేదా కొత్తగా ఆందోళన కలిగించే వేరియంట్ ఉద్భవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రద్దీ ప్రాంతాలకు వెళ్లడాన్ని తగ్గించాలని కోరింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ సూచనలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

