నీట్ లీకేజీ నిరసన సెగ.. భద్రాచలం బంద్ సక్సెస్

కలం, ఖమ్మం బ్యూరో: నీట్ పేపర్ లీకేజీ ఘటనపై (NEET Paper Leak Issue) కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు శుక్రవారం భద్రాచలంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ ఆందోళనకు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాధనపల్లి సతీష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి కొప్పుల రవీందర్ మాట్లాడుతూ, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. నీట్ లీకేజీ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు దోషులను కాపాడేందుకే ప్రభుత్వం విద్యార్థులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులను సామాజిక మాధ్యమాలలో దేశద్రోహులుగా చిత్రీకరించడం సరైన విధానం కాదని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం నిజమైన దేశభక్తి అని పేర్కొంటూ, నీట్ లీకేజీపై ఇంటెలిజెన్స్, భద్రతా వ్యవస్థల వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>