నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: ఈ నెల 3వ తేదీన ఆదివారం జరగనున్న నీట్ (NEET 2026) ప్రవేశ పరీక్షకు నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జ‌రగ‌నున్న నీట్ ప‌రీక్ష‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3334 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ మేరకు డిచ్ పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ భవనంలో, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూజీ బ్లాక్ లో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లో, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నిజామాబాద్ కంటేశ్వర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, మాక్లూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.

ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున, నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని అన్నారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, ఐ.డి ప్రూఫ్, లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఉపకారణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, గట్టి పోలీసు బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>