మసకబారుతున్న నల్ల బంగారం.. సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి

కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి (Singareni) కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సింగరేణి సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత దశాబ్ద కాలంలో చూసుకున్నా సరే, ఒక్క కరోనా సమయంలో తప్ప… ఎప్పుడూ సింగరేణి ఏర్పరుచుకున్న లక్ష్యాల కంటే తక్కువుగా ఉత్పత్తి నమోదు కాలేదు. అలాంటిది 2025-26 సంవత్సరంలో సింగరేణి 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని కేవలం 58 మిలియన్ టన్నుల ఉత్పత్తిని మాత్రమే సాధించడంతో, యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సింగరేణి చరిత్రలో వార్షిక టార్గెట్ లో ఇంత వెనుకబడడానికి కారణాలపై కొత్త ఎండీ బుద్ధ ప్రకాశ జ్యోతి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

గడిచిన పది సంవత్సరాలలో పరుగులు పెడుతూ, ఉత్పత్తి ఉత్పాదకల్లో వార్షిక లక్ష్యాల కంటే ఎక్కువ తీస్తూ, లాభాల మీద లాభాలు గడుస్తూ, ఉద్యోగులకు బోనస్ ల మీద బోనస్ లు ఇస్తూ, ముందుకు సాగిన సింగరేణి 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఎందుకంత వెనుకంజ వేసింది. తక్కువలో తక్కువ 58 మిలియన్ టన్నులతో ఎందుకు ముగిసింది, అనే దానిపై, యాజమాన్యం శత విధాల సమీక్షలు నిర్వహించింది. ఏరియా జనరల్ మేనేజర్ల డౌన్ ఫాలోయింగా? కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమా? అనే కోణంలో కూడా సమీక్షలు చేసినట్లు సమాచారం.

తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ లో ఉత్పత్తి ట్రెండ్ ను గమనించి నట్లయితే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 60.38 మిలియన్ టన్నుల నుంచి 2016-17లో 61.34 మిలియన్ టన్నులు, అలాగే 2023-24 లో 70.02 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెరుగుతూ 2025-26లో 58 మిలియన్ టన్నులకు పడిపోవడంతో సింగరేణి యాజమాన్యంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా షాక్ కు గురైంది. సింగరేణి వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉత్పత్తి తగ్గుదలపై అసహనం వ్యక్తం చేసినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనులు ఉన్న 12 డివిజన్లలో, ఒక్క సత్తుపల్లి డివిజన్ మినహా అన్ని ఏరియాల జీఎం ల పని తీరుపై సీఎండీ ఒక నివేదిక ఇప్పటికే తెప్పించుకున్నట్లు కార్మిక వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే జనరల్ మేనేజర్ల బదిలీకి కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు యూనియన్లలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

మరో పక్క సింగరేణి కార్మికుల గైర్హాజరు కూడా బొగ్గు ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏడాదికి ఒక్క రోజు కూడా డ్యూటీకి హాజరు కాని వారు 300 మంది, అలాగే సంవత్సరంలో కేవలం 50 రోజులు మాత్రమే డ్యూటీ చేసిన వారు 1000మంది, ఉన్నట్లు సంస్థ అంతర్గత రిపోర్టులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇక సంవత్సరం పేరు మీద 100 మాస్టర్లు ఉన్న వారు 1500లకు పైగా ఉండటం గమనార్హం.సింగరేణిలో సుమారు 40 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండగా, 25 వేల మంది నేరుగా బొగ్గు బావుల్లోకి వెళ్లి తవ్వకం చేపడుతుంటారు. అలాగే 15 వేల మంది ఆపరేటర్లు, మెకానిక్ లు, బ్లాస్టింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సుమారు 3 వేల మంది వరకూ కార్మికులు విధులు డుమ్మా కొడుతున్నట్లు కార్మికులే చెప్తున్నారు. సింగరేణి సంస్థ అందిస్తున్న సదుపాయాలు పొందుతూ, బయటి పనులు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది చోట నేతలు, మెడికల్ అన్ఫిట్ ద్వారా, వారసత్వ ఉద్యోగాలు పొందిన యువకులు ఉన్నట్లు తెలుస్తోంది.

సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు లక్షలాది కుటుంబాల జీవనాధారం. యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తే, సాంకేతిక అడ్డంకులను అధిగమించి సింగరేణి మళ్ళీ రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించడం అసాధ్యమేమీ కాదని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్ రావ్ చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>