కలం, కరీంనగర్ బ్యూరో: మక్కల కొనుగోళ్లను వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన మక్కల బస్తాలను వెంటవెంటనే గోదాంలకు తరలించి భద్రపరచాలని సూచించారు. శుక్రవారం జమ్మికుంట (Jammikunta) మార్కెట్ యార్డులోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. అనంతరం రోజుకు ఎన్ని క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేస్తున్నారు. గన్ని బ్యాగుల కొరత ఉందా, రవాణా ప్రక్రియ ఎలా జరుగుతోందనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Chitra Mishra) మాట్లాడుతూ.. రైతుల కష్టం పంట రూపంలో వస్తుందని, అందువల్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. లోడ్ చేసిన బస్తాలను వెంటనే గోదాంలకు తరలించాలని, గోదాంలో నిల్వ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ యార్డు పక్కన ఉన్న గోదాంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గోదాంలో స్టోర్ చేస్తున్న మక్కల బస్తాల నిర్వహణను పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియను సమన్వయం తో నిర్వహించాలని తెలిపారు.
కొనుగోలు చేసిన ప్రతి బస్తాను సురక్షితంగా గోదాంలో భద్రపరచాలని, ఎప్పటికప్పుడు లిఫ్టింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, హుజురాబాద్ ఆర్టీవో కే రమేష్ బాబు, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ మహమ్మద్ షహబుద్దీన్ తహసీల్దార్ వెంకటరెడ్డి తో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఎన్నికలు ముగిశాయి, బాదుడు మొదలైంది.. బీజేపీపై శ్రీధర్ బాబు ఫైర్
Follow Us On: X(Twitter)

