కలం, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు ఐపీఎల్ గట్టి షాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ముంబైకి, పొలార్డ్ ప్రవర్తన వల్ల ఇప్పుడు జరిమానా రూపంలో చేదు అనుభవం ఎదురైంది. అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ఈ పోరులో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్ సమయంలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముంబై బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ ఫోర్త్ అంపైర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం, పొలార్డ్ ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం, మైదానంలో అసభ్యంగా మాట్లాడటం నేరం. ఈ క్రమంలోనే పొలార్డ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ శుక్రవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనితో పాటు ఆయన ఖాతాలో ఒక డెమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రెఫరీ పంకజ్ ధర్మానీ విధించిన ఈ శిక్షను పొలార్డ్ అంగీకరించారు. తాను తప్పు చేశానని ఆయన ఒప్పుకోవడంతో విచారణ లేకుండానే ఈ జరిమానా ఖరారైంది.

