కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించే నియోజకవర్గస్థాయి కార్యక్రమాలను అధికారులంతా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) ఆదేశించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగే నియోజకవర్గస్థాయి సమావేశాలు, ధాన్యం కొనుగోలు, నీట్ పరీక్ష ఏర్పాట్లు, రైతు వారం విజయవంతం కార్యక్రమాలపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శనివారం జరిగే నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన వాటిని సమీక్ష నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు.
రైతులకు వెంటనే డబ్బులు అందించాలి..
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నీడ వసతి తాగునీటి సౌకర్యం ఇతర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు వెంటనే డబ్బులు అందించాలని పేర్కొన్నారు. ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాటు పక్కాగా చేయాలని.. అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యే రైతు వారం కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో రైతు వారం కార్యక్రమాన్ని ఆదర్శంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేష్ బాబు, సిపిఓ రామ్ దత్తారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, డిఆర్డిఓ శ్రీధర్, డిపిఓ జగదీశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

