కలం, నల్లగొండ బ్యూరో: నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrashekar) పిలుపునిచ్చారు. “జల్ సంచయ్ జన బాగిదారి” కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నల్గొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Burri Chaitanya Srinivas Reddy) తో కలిసి కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించుకోవాలని అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జల సంరక్షణపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రజలలో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాలను సందర్శిస్తుందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా నీటి సంరక్షణ, నీటి పొదుపు, ఉన్న నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలి వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వనరులను సంరక్షించుకోవాలని, నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై సహకరించాలని కోరారు.
నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షపు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని, నీటిని పొదుపుగా వాడుకుంటే వచ్చే తరాల వారికి నీటి కొరత లేకుండా చూడవచ్చని అన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్‌కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ వున్న జ్ఞానేశ్వరి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, డీఆర్డీఏ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం, తదితరులు పాల్గొన్నారు.

