కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం శ్రీ సీతారామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా, అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరు కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో, ఎటువంటి లోపాలకు తావు లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సారపాకలో హెలిప్యాడ్ వద్ద గవర్నర్ స్వాగత ఏర్పాట్లు ప్రారంభించి.. ఐటీసీ గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి, అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం, తదుపరి మిథిలా స్టేడియం లో మహా పట్టాభిషేకం కార్యక్రమం, గిరి మార్ట్ ప్రారంభోత్సవం, తిరిగి ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భోజన ఏర్పాట్లు వంటి అన్ని కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని మౌలిక సదుపాయాలను సమృద్ధిగా కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడంతో పాటు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం విజయవంతం కావడానికి ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ తదితరలు పాల్గొన్నారు.

