Mobile Popup Ad
Mobile Popup Ad

ఎర్రుపాలెం రూపురేఖలు చేంజ్.. రూ.110 కోట్లతో భట్టి ‘మెగా’ శంకుస్థాపనలు

కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంతర్గత రహదారులు, భారీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణంతో ఎర్రుపాలెం (Yerrupalem) మండల రూపురేఖలను మార్చేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. జాతరను తలపించేలా ఒకే రోజు సుమారు 110 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వరుస శంకుస్థాపనలు, భూమి పూజలు నిర్వహించారు. ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా రాబోయే రోజుల్లో ఎర్రుపాలెం మండలం సరికొత్త మౌలిక వసతులతో సరికొత్త రూపాన్ని సంతరించుకోబోతోందని స్పష్టం చేశారు.

బీటీ రోడ్డు పనులకు భూమి పూజ..

​మండలంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రధాన రహదారులతో పాటు మారుమూల గ్రామాలను సైతం అనుసంధానం చేయడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) పలు కీలకమైన బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ​గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ, మండలంలోని పలు గ్రామాలలోని ఎస్సీ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల కోసం ఉప ముఖ్యమంత్రి భారీగా నిధులు కేటాయించారు. ​ఇక ఎర్రుపాలెం మండలాన్ని వెలుగుల బాటలో నడిపేందుకు, ఇక్కడి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలను పరిష్కరించి సరఫరాను మెరుగుపరిచేందుకు రెండు భారీ సబ్‌స్థేషన్ల నిర్మాణానికి భట్టి పునాది వేశారు.

పెద్దగోపవరంలో రూ. 94.54 కోట్ల భారీ అంచనాతో 132/33 కేవీ సబ్‌స్థేషన్, అలాగే జమలాపురంలో రూ. 1.92 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ నాణ్యమైన విద్యుత్ సరఫరా ద్వారా స్థానిక రైతులకు, గృహ వినియోగదారులకు కరెంట్ కష్టాలు తీరనున్నాయని భరోసా ఇచ్చారు. భౌతిక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తూ, ములుగుమాడు గ్రామంలోని రామాలయ ప్రాంగణంలో రూ. 90 లక్షల అంచనాలతో చేపట్టనున్న భక్తాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

పనులన్నీ అత్యంత వేగంగా పూర్తి చేస్తాం..

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. పనుల నిర్వహణకు నిధుల కొరత ఏమాత్రం లేదని, నిర్దేశిత గడువులోగా పనులన్నీ అత్యంత వేగంగా పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.​ ఈ విస్తృత పర్యటనలో జిల్లా కలెక్టర్ దివాకర్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డిలతో పాటు స్థానిక నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Read Also: ఎయిరిండియా గొప్ప నిర్ణయం.. వారికి ఉద్యోగాలు

Read Also: పిల్లల్ని కనడం లేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>