కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (CM Suvendu Adhikari) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మతపరంగా ఇచ్చే ఆర్థిక సాయం పథకాలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ ప్రకటించారు. రెండో కేబినెట్ సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత నెలకు మాత్రమే ఆ పథకాలు వర్తిస్తాయని, వచ్చే నెల నుంచి ఆగిపోతాయని వెల్లడించారు. మదర్సా శాఖ, సమాచార, సాంస్కృతిక శాఖల పరిధిలోని మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.
అలాగే జూన్ 1 నుంచి మహిళలకు రాష్ట్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బీజేపీ చేసిన వాగ్దానం మేరకు జూన్ 1 నుండి మహిళలకు రూ.3,000 సాయం అందించే “అన్నపూర్ణ యోజన” పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనతో ఆ రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం సీఎం సువేందు అధికారి తన మొదటి ‘‘జనతా దర్బార్’’ను నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను పరిశీలించారు. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ సాధించలేని విజయాలను.. అధికారంలోకి వచ్చిన తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం తొలి వారంలోనే సాధిస్తుందని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

