కలం, వెబ్ డెస్క్: మృగశిర కార్తె సందర్భంగా తొలకరి జల్లులు పుడమి తల్లిని పులకరించిన వేళ తెలంగాణ రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే తొలకరి పలకరింపులు రైతులు, రైతు కూలీల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. రైతులందరూ ఒకే పంటను పండించడమే కాకుండా.. వినూత్నంగా అలోచించి వివిధ రకాల పంటలను పండించాలని సూచించారు. తద్వారా భూసారం బలంగా మారి, అనేక రకాల పంటలు, కూరగాయల దిగుబడి పెరుగుతుందని ఆశించారు. రైతులందరూ వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని పంటలకు సిద్ధం కావాలని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండటంతో వాతావరణ శాఖ సూచనలతో ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని రైతన్నలకు సూచించారు. పరిమితమైన పంటల సాగుపైనే రైతులు దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు అనేక రకాల పంటలను పండించాలని సూచించారు. ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని సీఎం అభిలషించారు.

