సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట షెడ్యూల్ ఖరారు

కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మౌలిక స్వరూపాన్ని మార్చేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 23న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుట్టలో పర్యటించి దాదాపు రూ. 100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమంతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న సీఎం, అనంతరం ఆలయ బోర్డు ఏర్పాటు, అభివృద్ధి పనులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలావుంటే.. సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం గుట్టను వేధిస్తున్న పలు దీర్ఘకాలిక సమస్యలు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు కరువవ్వడం.. ఆలయ పరిసరాల్లో సాగుతున్న కొన్ని వర్గాల ఆధిపత్యంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కొండపైన వర్తక సంఘం ‘దోపిడీ’.. స్థానికుల పోరాటం

యాదగిరిగుట్ట కొండపైన దుకాణాల నిర్వహణ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు స్థానికులకు కాకుండా వర్తక సంఘం పేరిట ఒక సిండికేట్ ఏర్పడి సామాన్యులను దోపిడీ చేస్తోందని స్థానికులు పెద్దఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా, స్థానిక చిన్న వ్యాపారులకు న్యాయం చేయాలంటూ గత కొన్ని రోజులుగా స్థానికులు, వ్యాపార సంఘాలు పెద్దఎత్తున పోరాటాలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ సిండికేట్ వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట ఆలయ అంతర్గత వ్యవహారాల్లో అవినీతి రాజ్యమేలుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ దర్శనాలు, ప్రసాదాల కౌంటర్లు, ఇతర సేవల విభాగాల్లో పారదర్శకత లోపించిందని భక్తులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే సామాన్య భక్తులకు కొండపైన కనీస సౌకర్యాలు (తాగునీరు, నీడ, విశ్రాంతి గదులు) కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలు, ఈ పర్యటనలోనైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. కొండపై దుకాణాల కేటాయింపుల్లో పారదర్శకత, ఆలయ ప్రక్షాళన, భక్తుల సౌకర్యాల మెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష నిర్వహిస్తారు? ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

​రూ. 100 కోట్లతో చేపట్టే ప్రధాన అభివృద్ధి పనులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహాస్వామి ఆలయానికి సంబంధించి టెంపుల్ సిటీ పరిధిలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న వేద పాఠశాలకు, గతంలో బాలాలయం ఉన్న ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నిత్య కళ్యాణ మండపానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతన వసతి సదనాన్ని నిర్మించనున్నారు. కొండ కింది నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చే భక్తులు ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు వీలుగా పూర్తిగా పైకప్పు సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. భక్తులు సులువుగా మాడవీధుల్లోకి చేరుకునేందుకు వీలుగా అత్యాధునిక లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>