‘మత్తుబాట వదలండి.. మైదానాల బాట పట్టండి’ అంటూ సీఎం రేవంత్ పిలుపు

కలం, వెబ్ డెస్క్: ప్రజా జీవితంలో ఉండే వారికి క్రీడలు ఓ ఉపశమనం అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ‘మత్తుబాట వదలండి.. మైదానాల బాట పట్టండి’ అంటూ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ శాసనసభ్యుల క్రీడా పోటీలు–2026′(Telangana Legislators Games 2026) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాసనసభ్యుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ క్రీడా పోటీలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రీడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనాలని సీఎం ఆకాంక్షించారు. శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు అవసరమని చెప్పారు. శాసనసభ్యుల మధ్య స్నేహభావం, సమన్వయం పెంపొందించడంలో ఇటువంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ నిరంతరం సమస్యలంపరిష్కారం కోసం విరామం లేకుండా పనిచేసే వారికి ఇది అద్భుతమైన అవకాశం అని సీఎం అన్నారు. ఇక్కడ అద్భుతంగా ఆడకపోవచ్చు కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుందన్నారు. ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు మంత్రివర్గంలో ఉన్నారని చెప్పారు. క్రికెట్ లో దేశానికి వన్నె తెచ్చిన అజారుద్దీన్ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారని అన్నారు.

ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది.. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత క్రీడా స్ఫూర్తి కరువైందని చెప్పారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలంపిక్స్ లో ఒక్క పతకం సాధించలేదని చెప్పారు. 3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందన్నారు. సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకే 16 గోల్డ్ మెడల్స్ వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకుని రాణించాలని సూచించారు.

క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చామన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ పార్టీలకు దూరంగా, మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైందని వివరించారు. ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. గచ్చిబౌలి స్టేడియంను ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నామని వివరించారు. బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఫుట్ బాల్ లో గతంలో దేశానికి మెడల్స్ తెచ్చిన ఏడుగురిలో నలుగురు మన ప్రాంతానికి చెందినవారు ఉన్నారని చెప్పారు. మళ్లీ ఆ స్థాయికి క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించామన్నారు.

Read Also: శోభాయాత్రలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>