కలం, వెబ్ డెస్క్ : క్రీడా రంగంలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని.. దీనికి అనుగుణంగా కార్యాచరణతో పాటు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై సీఎం తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి రేవంత్ పలు కీలక సూచనలు చేశారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం జూన్ 2 వ తేదీన గచ్చిబౌలి అభివృద్ధికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఆలోపు పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
స్టేడియంలో హెలిప్యాడ్తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం (CM Revanth Reddy) సూచించారు. క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్ లో స్టేడియానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా రూపొందిస్తామని.. దీనికోసం ఇప్పటికే అర్కిటెక్ట్ ను నియమించినట్లు వెల్లడించారు. స్టేడియం అభివృద్ధికి బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్దే తమ లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు. ఒలింపిక్ క్రీడలు హైదరాబాద్ లో నిర్వహించేలా సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ భేటీలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, కో చైర్మన్ కొణిదెల ఉపాసన, సభ్యులు కావ్య మారన్, సి.శశిధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

