Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ ఆలోచన విరమించుకోండి : సీఎంకు విద్యావేత్తల బహిరంగ లేఖ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను భారీగా కుదించాలనే ప్రభుత్వ ఆలోచనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి వారు ఒక బహిరంగ లేఖ (Academicians Open Letter)ను రాశారు.

జూన్ 6వ తేదీన బెంగళూరులో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 కు కుదిస్తామని చేసిన ప్రకటన విద్యా రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 23,000 బడులు మూతపడతాయని, దీనిని తక్షణమే పునఃసమీక్షించి, ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే రాష్ట్రంలోని 8,769 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. నివాస ప్రాంతాలకు బడులు దూరం కావడం వల్ల రవాణా, భద్రతా సమస్యల కారణంగా దళిత, ఆదివాసి, బీద బడుగు వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని (RTE) ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని, గత ప్రభుత్వం మూసివేసిన 6,000 బడులను తెరుస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దానికి భిన్నంగా 23,000 బడులను మూసివేయాలని చూడటం కాంగ్రెస్ వాగ్దానాల ఉల్లంఘనే అవుతుందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో విద్యా పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, 25 జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు, 612 మండలాల్లో ఎంఈఓలు లేకపోవడం వల్లే విద్యా ప్రమాణాలు పడిపోయాయని వారు విమర్శించారు. ‘జయశంకర్ బడిబాట’ వంటి కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం వల్లే బడుల్లో చేరికలు తగ్గి ‘జీరో ఎన్రోల్మెంట్’ సమస్యలు వస్తున్నాయని, దీనిపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేయకుండా బడులను మూసివేయడం సరికాదని అన్నారు.

తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ లేఖపై జస్టిస్ బి. చంద్రకుమార్, జస్టిస్ రాధారాణి, ప్రొఫెసర్ కోదండరామ్, దేశపతి శ్రీనివాస్, గోరెటి వెంకన్న, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌తో పాటు పలువురు విద్యావేత్తలు, కవులు, ప్రజా సంఘాల నేతలు సంతకాలు (Academicians Open Letter) చేశారు.

Read Also: వానల్లేవ్.. రాష్ట్ర ఖజానాకు కష్టమే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>