కలం డెస్క్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGS) స్థానంలో వీబీ – జీ రామ్ జీ (VB-G RAM G) చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో గ్రామీణ పేదలకు ఒక హక్కు లభించిందని, దాన్ని నీరుగార్చే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం పేదల పొట్ట కొట్టడమేనని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర పీసీసీ (Telangana PCC) ఆధ్వర్యంలో జిల్లాల్లో బహిరంగసభలు పెట్టేలా కార్యాచరణ సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా జిల్లాల్లో జరిగే బహిరంగసభలకు హాజరుకానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యే ఈ సభలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ములుగు సభకు సోనియా, రాహుల్
మొత్తం తొమ్మిది జిల్లాల్లో బహిరంగసభకు పీసీసీ షెడ్యూలు ఖరారు చేయగా ములుగులో జరిగే బహిరంగసభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని (Sonia Gandhi), లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని (Rahul Gandhi) ఆహ్వానించనున్నట్లు స్వయంగా సీఎం రేవంత్ తెలిపారు. ఈ సభలను సక్సెస్ చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సభలను పర్యవేక్షించనున్నారు. వీబీ – జీ రామ్ జీ చట్టానికి నిరసనగా అన్ని మండలాల్లో ఇలాంటి సభలను నిర్వహించాలని పీసీసీ తీర్మానం చేయడంతో ఒక మండలంలోని బాధ్యతను తానే తీసుకుంటానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


