పోలీసులు అప్ గ్రేడ్ కావాలి: రేవంత్ రెడ్డి

కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ప్రస్తుతం నేరాలు చేసే పద్ధతి మారిపోయిందని చెప్పారు. గతంలో కేవలం ఫిజికల్ నేరాలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం డిజిటల్ నేరాలు పెరిగిపోయాయని రేవంత్ అన్నారు. అందుకు తగ్గట్టుగా పోలీస్ వ్యవస్థలో మార్పులు రావాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీస్ అకాడమీ వద్ద తెలంగాణ పోలీస్ అధికారుల రిట్రీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఏ విపత్తు వచ్చినా ముందుగా పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. అందుకే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రపంచం వేగంగా మారుతోంది

ప్రపంచం అత్యంత వేగంగా మారుతోందని అందుకు తగినట్టుగా పోలీసులు మారాల్సిన అవసరం ఉందన్నారు. 24 గంటలకు 2 సెంటిమీటర్ల వర్షం పడితే తట్టుకోగలిగే శక్తి మాత్రమే హైదరాబాద్ నగరానికి ఉందని .. కానీ రెండు మూడు గంటల్లోనే 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం పడుతోందన్నారు. అందుకు తగినట్టుగా వ్యవస్థలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తీవ్రవాద సమస్య పోలీసులకు సవాల్‌గా ఉండేదని.. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ఆక్టోపస్, గ్రే హౌండ్స్, ఎస్ఐబీ (SIB) లాంటివి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీబీసీఐడీ లాంటివి తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు పటిష్ఠ వ్యవస్థలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

విచారణ విధానం మారాలి

ప్రస్తుతం నేరాల పరిధి, నేరాలు చేసే విధానం మారిపోయిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగినట్టుగా పోలీసులు విచారణ విధానంలోనూ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫిజికల్ క్రైమ్ కోసం సిస్టమ్ అభివృద్ధి చెందిందని.. కానీ ఇప్పుడు డిజిటల్ క్రైమ్ పెరిగింది కాబట్టి అందుకు తగినట్టుగా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. మొబైల్ ఫోన్లు చేతిలో పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని రేవంత్ పేర్కొన్నారు.

ఏఐ వినియోగం పెరగాలి

పోలీసులు తమ విచారణలో భాగంగా ఏఐని విస్తృతంగా వాడాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్థులు ఏఐని వాడుకుంటున్నారు కాబట్టి పోలీసులు కూడా ఏఐ టెక్నాలజీ వాడుకొని నేరగాళ్లను పట్టుకోవాలని పేర్కొన్నారు. పోలీసులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించాలని.. ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ‘ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. మనం ఎక్కడున్నామో తెలిసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుంది. అందుకే ఈ రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలు, పరిష్కారాలపై విశ్లేషించుకున్నాం.
ఛాలెంజ్‌లు రెండు రకాలు.. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్. రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ ను అధిగమించవచ్చు. కానీ… అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థంచేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

3 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

‘పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2100 కి.మీ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా పరిగణించుకుంటున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్య ఏమిటో గుర్తిస్తే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లే. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. సమస్యల పరిష్కారానికి మీరు అందించిన ప్రతిపాదనలపై విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం. మీ ప్రతిపాదనలపై కమిటీలో విశ్లేషించి చట్టం రూపంలో మా ముందుకు తీసుకురండి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుంది. పోలీస్ శాఖలో సిబ్బంది రేషనలైజేషన్ చేసుకుని జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. పోలీస్‌శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరం’ అంటూ రేవంత్ (CM Revanth Reddy) సూచించారు.

Read Also: వార్​ ఎఫెక్ట్​ : పాక్​లో స్కూళ్లు మూత.. జీతాల్లో కోత​

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>