పెండింగ్​ బిల్లులు వెంటనే చెల్లించాలి : మాజీ సర్పంచులు

కలం, నల్లగొండ బ్యూరో : గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి, ఏళ్ల తరబడి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న మాజీ సర్పంచుల సహనం నశించింది. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట (Suryapet) జిల్లా కలెక్టరేట్ ముందు అర్థనగ్న ప్రదర్శనతో భారీ నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోతున్నామని, ప్రభుత్వం తమను మోసం చేస్తోందని మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 2023-24, 2024-25 సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.247 కోట్లను విడుదల చేసిందన్నారు. ఒకవైపు పంచాయతీరాజ్ మంత్రి, కమిషనర్ బిల్లులు చెల్లించాలని జీవోలు ఇస్తుంటే, మరోవైపు పంచాయతీ సెక్రెటరీలకు రహస్య సర్క్యులర్లు పంపి బిల్లులు ఆపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎస్ఎఫ్​సీ గ్రాంట్స్ కింద ఒక్క రూపాయి కూడా పెండింగ్ బిల్లులకు కేటాయించలేదని విమర్శించారు. గ్రామాల్లో పనులు చేసేందుకు వడ్డీలకు డబ్బులు తెచ్చి ఖర్చు చేశామని, ఇప్పుడు బిల్లులు రాక వడ్డీలు కట్టలేక తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్(Suryapet ), పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో నూతనకల్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు చూడి లింగారెడ్డి, తుంగతుర్తి మండల ఫోరమ్ ఉపాధ్యక్షుడు లకావత్ యాకూ నాయక్, మాజీ సర్పంచులు గంధం మల్లారెడ్డి (రామన్నగూడెం), మామిడి వెంకన్న (వెలుగుపల్లి), గోవింద్ రెడ్డి, శ్రీను, వీరన్న, పుణ్య నాయక్, శంకర్ నాయకులు, పాముల ఉపేందర్, రమేష్, శ్రీను, నవీన్ రెడ్డి, నర్సింహా, జగపతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>