బీఆర్ఎస్ వ్యూహాలకు సీఎం బ్రేక్..

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ (BRS) ఇటీవల పలు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బాధితులు, నిర్వాసితులతో కలిసి ప్రోగ్రామ్‌లకు ప్లాన్ చేసినా ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదన్నది బీఆర్ఎస్ శ్రేణుల భావన. కానీ ఇష్యూను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రభుత్వం స్పందించేలా చేయడంలో మాత్రం విజయం సాధించామన్న అభిప్రాయం వ్యక్తమైంది. హైడ్రా, గాంధీ సరోవర్ (బాపు ఘాట్), మూసీ పునరుజ్జీవనం, అక్రమ మైనింగ్, అప్పుల భారం.. ఇలాంటి పలు అంశాలను బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చి ఆందోళనలు చేసినా వాటిని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ప్రభుత్వం వివరణ తర్వాత వాటి వేడి తగ్గిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పకడ్బందీ వ్యూహంతో ఈ అంశాలతో ఎక్కువ కాలం నిరసనలు కొనసాగించలేని పరిస్థితుల్లోకి బీఆర్ఎస్‌ను నెట్టివేశారు. దీంతో తాజాగా మూసీ బస్తీ యాత్ర (Musi Basti Yatra)ను జేఏసీ పేరుతో బీఆర్ఎస్ చేపట్టాల్సి వచ్చింది.

హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా.. :

చెరువులు, కుంటలు, నాలాలు, నదుల అక్రమ ఆక్రమణలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రజాందోళనలను ప్రారంభించింది. కొద్దికాలం ఆ వేడి వాతావరణం కొనసాగినా ఆ తర్వాత పలు ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుంచి విముక్తి చేయడం, మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ప్రత్యామ్నాయ ఇంటి వసతి కల్పించి అక్కడి నివాసాలను ఖాళీ చేయించడం, గతంలో ఆక్రమణలకు గురైన కుంటలను తిరిగి పునరుద్ధరించడంతో ప్రజల్లోనూ సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు హైడ్రాకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ, బీఆర్ఎస్ ప్రజాందోళనకు శ్రీకారం చుట్టినా ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోవడం.. ఇలాంటి కారణాలతో ఆ నిరసనలకు స్వస్తి చెప్పక తప్పలేదు.

బాపు ఘాట్‌ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ :

మూసీ నది ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్టు (బాపు ఘాట్)ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. నదికి ఆనుకుని ఉన్న, బఫర్‌ జోన్‌లోని కొన్ని నిర్మాణాలను తొలగించక తప్పదంటూ ప్రభుత్వ అధికారులు కొన్ని అపార్టుమెంట్లకు నోటీసులు జారీచేశారు. సుమారు 420 కుటుంబాలున్న మధుపార్క్ రిడ్జ్ బహుళ అంతస్తుల అపార్టుమెంటు విషయంలో బాధితులతో కలిసి భారీ స్థాయిలోనే ఆందోళన చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. పలుమార్లు ఆ బాధిత కుటుంబాలతో కలిసి నిరసనలు చేపట్టింది. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించి బీఆర్ఎస్ రాజకీయ రంగు పులమడాన్ని ఎండగట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్‌లో నిర్మాణమైన అపార్టుమెంటు అంశాన్ని వివరించి నిర్వాసితులకు ప్రభుత్వం తరపున ప్రత్యామ్నాయాన్ని, పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో బీఆర్ఎస్ ఆందోళనలకు బ్రేక్ పడింది.

మూసీ ప్రాజెక్టులోనూ సీఎం కౌంటర్ స్ట్రాటెజీ :

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది. డీపీఆర్ తయారుకాకముందే లక్షన్నర కోట్ల ఖర్చు గురించి ప్రస్తావించింది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రతిపక్ష పొలిటికల్ స్టంట్‌ను ఎండగట్టాలని సీఎం భావించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బాపు ఘాట్, మూసీ పునరుజ్జీవనం గురించి వివరించారు. చివరకు బాపు ఘాట్ కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏడు వేల కోట్ల రూపాయలు కూడా దాటడంలేదని, కానీ బీఆర్ఎస్ మాత్రం లక్షన్నర కోట్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని సీఎం తనదైన శైలిలో వివరించారు. ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించాలన్న బీఆర్ఎస్ ఎత్తుగడను చిత్తు చేయడంతో పాటు వాస్తవాలను వివరించడంతో ఆ అంశంపై నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకోక తప్పలేదు.

తాజాగా మూసీ బస్తీ జనయాత్రకు శ్రీకారం :

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన పలు మురికివాడల ప్రాంతాల్లోని ఇండ్లను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అప్పట్లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘రాత్రి నిద్ర’ పేరుతో హడావిడి చేశారు. నాలుగైదు రోజుల పాటు హంగామా నడిచినా ఆ తర్వాత సద్దుమణిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ అదే తరహాలో ‘మూసీ తీరాన బస్తీ జనయాత్ర’ పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. బీఆర్ఎస్ లీడర్లు జేఏసీ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వివిధ రూపాల్లో అసంతృప్తి ఉన్నా అది బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడానికి ఉపయోగపడలేదనే రిపోర్టు ఆధారంగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలతో కలిసి ఆందోళనలను నిర్వహించాలని భావించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కౌంటర్ స్ట్రాటెజీతో ప్రజల మద్దతు లభించకుండా బీఆర్ఎస్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. రానున్న రోజుల్లో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా సెక్షన్లవారీగా ఆందోళనలు చేయాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. కౌంటర్‌గా ఎలాంటి ఎత్తుగడలతో సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకుంటారన్నది ఆసక్తికరం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>