కలం, వెబ్ డెస్క్ : కృత్రిమ మేధ (AI) రెండు వైపుల పదునున్న కత్తి లాంటిదని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా చూపుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. అమెరికా బోస్టన్ సిటీలోని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కృత్రిమ మేధస్సు (AI)పై శుక్రవారం రాత్రి నిర్వహించిన సదస్సులో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్ గా ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచమంతా AI గురించి ఆలోచిస్తోందన్నారు. Open AI ChatGPT ని ప్రారంభించిన తర్వాత Gemini, Claude, Grok, Deepseek, Perplexity, Copilot వంటి ఎల్ఎల్ఎంలు దైనందిన జీవితంలో భాగమయ్యాయన్నారు.
గతంలో నూతన సాంకేతికత వచ్చినప్పుడు భయాలు కలిగాయని, ఏఐ పై కూడా ఇలాంటి అభిప్రాయం ఉందన్నారు. పారిశ్రామిక విప్లవంతో యంత్రాల ముందు మనిషి శారీరక సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం ఏఐతో ఆలోచనా సామర్థ్యానికి సవాల్ ఎదురవుతోందని, ఇది అనేక ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. యంత్రాల రాకతో ఉద్యోగాలు పూర్తిగా పోలేదని, కేవలం అవి పనిని తేలిక చేశాయన్నారు. అలాగే AI డాక్టర్లు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, రచయితలు వంటి వారి పనుల్లో మార్పు తీసుకువస్తుందే తప్ప పూర్తిగా వారిని తొలగించలేదని అభిప్రాయపడ్డారు. ఏఐతో ప్రాథమిక స్థాయి ఉద్యోగాల సంఖ్య తగ్గినా.. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు.
హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సెంటర్ అని సాఫ్ట్ వేర్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సైస్, మ్యానుఫాక్చరింగ్, ఏరో స్పేస్, ఢిపెన్స్, రిటైల్ రంగాలకు గ్లోబల్ సంస్థల కేంద్రం అని చెప్పారు. వైట్ కాలర్ జాబ్‌ల సక్సెస్‌పైనే హైదరాబాద్ నగరం ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏఐ ఉద్యోగాలను తగ్గిస్తే, సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనికోసమే “భారత్ ఫ్యూచర్ సిటీ”ని నిర్మిస్తున్నామని, అందులో ఒక భాగాన్ని AI సిటీగా అభివృద్ధి చేస్తున్నాని వివరించారు. ప్రపంచానికి కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీని మారుస్తాం అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా తయారీ రంగాన్ని అభివృద్ధి చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది లక్ష్యం అని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి రీ స్కిల్లింగ్ అందించడానికి హార్వర్డ్ వంటి ప్రపంచ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

