నికరజలాల్లో మా వాటాను వదులుకోం : సీఎం రేవంత్ రెడ్డి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రానికి కేటాయించిన నికర జాలాల్లో తమ వాటాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని, కృష్ణ, గోదావరి జలాల్లో చుక్క నీటిని వదిలే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ నుండి ఎంపీగా గెలిచి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను బొంద పెట్టారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మొదలుకొని హరీష్ రావు దాకా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని భావించాం కానీ కనీసం భూసేకరణ కూడా చేయకుండా పంప్ హౌస్ లు, మోటార్లు, బిగిస్తే ప్రాజెక్టులకు నీళ్లు ఎలా అందుతాయని నిలదీశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ.1 లక్ష 81 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం ఖర్చు చేస్తే.. అందులో లక్ష కోట్లు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. అత్యంత కీలకమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 90 టీఎంసీల నీళ్లు అందించొచ్చని తెలిసినా కల్వకుంట్ల కుటుంబం ఎందుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జూరాల, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఇతర ప్రాజెక్టులు నిర్మించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే.. ఈ జిల్లాలో26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని సీఎం తెలిపారు .

పదేళ్ల సుదీర్ఘ కాలంలో పాలమూరు ఎత్తిపోతలకే కేసీఆర్ రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, పంపులు, లిఫ్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టారని అన్నారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని.. ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్ట మొదట చేయాల్సింది భూసేకరణ చేయాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లాలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ జరగలేదని, భూసేకరణ పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయని కేసీఆర్ ఎలా భావించారని మండిపడ్డారు. కేసీఆర్ ఆలోచన ఎంతసేపూ పంపులు, లిఫ్టులు, వేలకోట్ల కాంట్రాక్టర్ల, బిల్లులు చెల్లించి కమీషన్లు కొట్టేయడమేనని ఆయన దుయ్యబట్టారు. మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఎండ్లకేండ్లు ఈ విషయమై కొట్లాడారని గుర్తు చేశారు. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటీ బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తున్నారని ఈ విషయమై జిల్లా ప్రజలు వాస్తవాలను గుర్తించుకోవాలని సూచించారు.

కాశీ వరకు నడిస్తే పాపాలు పోతాయన్నారు. ప్రజలు చీదరించుకుంటారన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పదేళ్లలో కేసీఆర్ కట్టిన అప్పు రూ. 84,503 కోట్లు అయితే, తాము అధికారంలోకి వచ్చాక 30 నెలల్లో రూ. 52,120 కోట్ల అప్ప కట్టామని సీఎం గుర్తు చేశారు. తాము 30 నెలల్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది రూ. 22 వేల కోట్లు మాత్రమే అయితే, ఇందులో రూ.8 వేల కోట్లు కేవలం పాలమూరు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామన్నారు. ఇప్పటికీ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.

రాబోయే రెండేళ్లల్లో జిల్లాలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని పని చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా శాంతి కూడగట్టుకుని పని చేస్తున్నామన్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాల్లో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తోపాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, మెగారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, చిక్కుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>