కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికే రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ కోరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మైనింగ్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళ్తుందని సీఎం ప్రకటించారు. సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నామన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుందని వివరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంత పారదర్శకంగా తీసుకున్న చర్యలను అభినందిస్తే అధికారులు మరింత ఉత్సాహంగా పని చేసేవారని, ప్రభుత్వం ఇచ్చిన నోటీసును తీసుకొచ్చి బీఆర్ఎస్ నేతలు ఏదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మాదిరి హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని మేం అనుకోవడం లేదని వెల్లడించారు. అందుకే పదేళ్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్రమ మైనింగ్ పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ సభ్యులు ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని సూచించారు. ఇతర పార్టీల సభ్యులు కూడా తెలంగాణ ఖనిజ సంపద దోపిడీకి సంబంధించి సమాచారం ఉంటే అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దానిపై సంపూర్ణంగా విచారణ చేపట్టి దోషులను శిక్షించే బాధ్యత తీసుకుంటుందన్నారు. ఇక హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందేని, అందుకే నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని సీఎం అన్నారు.

