కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం వేదికగా తెలంగాణ రాజకీయం మునుపెన్నడూ లేనంతగా వేడెక్కింది. నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ‘రాజన్న సిరిసిల్ల పర్యటన’ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను ఆయన సొంత గడ్డపైనే కార్నర్ చేయాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తుంటే..దానికి సరిసమానమైన ‘ముందస్తు ప్రతివ్యూహాలసతో బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. పొలిటికల్ రీజన్లో కాంగ్రెస్ దాడిని ముందే ఊహించిన కేటీఆర్.. కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా రివర్స్ అటాక్ మోడ్‌లోకి వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మరింది. లక్ష్యం కేటీఆర్ కోట… వ్యూహం అసెంబ్లీ ’22-ఎ’ డిబేట్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం పీక్స్‌కు వెళ్లింది.. కేటీఆర్ ‘లీగల్.. పొలిటికల్’ షీల్డ్ వ్యూహంతో గులాబీ, హస్తం నేతల మధ్య ‘పవర్’ వార్ నెలకొననుంది.
కక్షసాధింపు ముద్ర.. కాంగ్రెస్ విమర్శలపై పొలిటికల్ షీల్డ్
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించిన భూముల వ్యవహారాలు (22-A), బతుకమ్మ చీరలు, ఇసుక అక్రమాల ఆరోపణలను కేటీఆర్ ముందే తిప్పికొట్టే వ్యూహం ఎంచుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర రజతోత్సవ హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిరిసిల్లను లక్ష్యంగా చేసుకుందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అస్త్రాన్ని ప్రధానంగా వినిపిస్తున్నారు. 2007 కంటే ముందు ఇచ్చిన పట్టా భూముల కొనుగోలు వ్యవహారాన్ని కావాలనే అక్రమ కబ్జాలుగా చిత్రీకరిస్తున్నారని, చట్టబద్ధంగా జరిగిన వ్యవహారాలపై కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కేటీఆర్ గులాబీ శ్రేణులను అలర్ట్ చేశారు.
లీగల్ నోటీసులతో రివర్స్ కౌంటర్
కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా లీగల్ వార్‌ను ప్రారంభించడం కేటీఆర్ వ్యూహంలో కీలక ఘట్టం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని స్పష్టం చేస్తూ నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ద్వారా రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేయించడం ద్వారా కాంగ్రెస్ ఆరోపణల దాడికి గట్టి అడ్డుకట్ట వేశారు. ఈ లీగల్ మూవ్ ద్వారా కాంగ్రెస్ చేసే ఆరోపణలు చట్టబద్ధంగా నిలవవనే సందేశాన్ని రాజన్న సిరిసిల్ల ప్రజలకు, గులాబీ కేడర్‌కు బలంగా పంపగలిగారు.
సిరిసిల్ల అభివృద్ధే ఆత్మరక్షణ కవచం
రేవంత్ రెడ్డి ‘సవతి తల్లి ప్రేమ’, ‘నిధుల మళ్లింపు’ ఆరోపణలను తిప్పికొట్టేందుకు కేటీఆర్ తన మార్క్ ‘మోడల్ సిరిసిల్ల’ కార్డ్‌ను వాడుతున్నారు. ఒకప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలతో వార్తల్లో నిలిచిన సిరిసిల్లను బీఆర్ఎస్ హయాంలో టెక్స్టైల్ హబ్‌గా ఎలా మార్చారో ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సభకు ముందే సిరిసిల్లలోని చేనేత కార్మికులు, స్థానిక రైతులతో మమేకమవుతూ ‘సిరిసిల్లపై ప్రభుత్వం కక్ష గట్టి అభివృద్ధిని ఆపేస్తోంది’ అనే విమర్శను ముందుకు తెస్తున్నారు.
కేడర్‌లో జోష్.. గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్
రేవంత్ రెడ్డి సభ ముగిశాక స్పందించడం కంటే సభకు ముందే నియోజకవర్గంలో కేడర్‌ను సమాయత్తం చేయడం కేటీఆర్ ముందస్తు ప్రణాళికలో భాగం. ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఆరోపణలకు గ్రామాల వారీగా ఎలా కౌంటర్ ఇవ్వాలో దిశానిర్దేశం చేశారు. మరో వైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులు గాలం వేశారు. తంగళ్లపల్లితో పాటు పలు మండలాల్లో అక్రమంగా పట్టాలు పొందిన పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేశారు. కాగా అసైన్డ్ భూముల కేటాయింపులపై రాష్ట్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన పేదలకు అందించాలని సీపీఐ విజ్ఞప్తి చేస్తుంది. అసైన్డ్ భూముల రీ-సర్వే, అరెస్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేధింపులపై బాధితుల తరఫున బిఆర్ఎస్ లీగల్ సెల్ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
త్రిముఖ వ్యూహం.. రసవత్తరం..
తెలంగాణ రాజకీయాల్లో గులాబీ దళానికి క్వార్టర్ హెడ్‌క్వార్టర్స్‌గా మారిన రాజన్న సిరిసిల్ల నియోజకవర్గమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహరచన చేస్తోంది. గులాబీ దళానికి గట్టి పట్టున్న ప్రాంతంలో రేవంత్ రెడ్డి సభ ద్వారా కాంగ్రెస్ ఏ స్థాయిలో కేటీఆర్‌కు చెక్ పెట్టగలదోననే చర్చ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. కాంగ్రెస్ అధినేత సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుంటే.. కేటీఆర్ మాత్రం ‘పొలిటికల్ కౌంటర్ + లీగల్ వార్ + డెవలప్మెంట్ కార్డ్’ అనే త్రిముఖ వ్యూహంతో కాంగ్రెస్ విసురుతున్న అస్త్రాలను తిప్పికొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నాటికి కేటీఆర్ వేసిన ఈ ‘చక్రవ్యూహం’ కాంగ్రెస్ దాడి తీవ్రతను ఏ మేరకు తగ్గిస్తుందనేది రాబోయే రోజుల్లో రసవత్తరంగా మారనుంది.

