కలం, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)(Adilabad RIMS) ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వార్డులోని ఎయిర్ కండిషనర్ (AC) ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ పేలిన తీవ్రతకు మంటలు చెలరేగి వార్డు మొత్తాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.
ప్రమాద సమయంలో వార్డులో 27 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన మిగతా చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ లతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు.

