కలం, వెబ్ డెస్క్: తన రాజకీయ ప్రస్థానంలో మిడ్జిల్ మండలానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. 2006లో జులై నాలుగో తేదీన తాను జడ్పీటీసీగా గెలిచి రాజకీయం మొదలుపెట్టానని, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇదన్నారు. తనది వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామమైనా.. మిడ్జిల్ నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఆ సమయంలో ఇక్కడివారితో తనకు పెద్దగా పరిచయాలే లేవన్నారు. మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. నేడు రాష్ట్రంలో మహా వృకమైందని వెల్లడించారు.
రబ్బానీకి పదవి ఇవ్వాలి..
జడ్పీటీసీగా అప్పుడు తనపై ఓడిపోయిన రబ్బానీ, గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తూనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనకు ప్రభుత్వంలో మంచి పదవి ఇవ్వాలని వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. అంతేగాకుండా, మండల అభివృద్ధికి అవసరమైన నిధుల బాధ్యత తీసుకోవాలని కోరగా.. భట్టి అంగీకరించారు. ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

