epaper
Wednesday, February 18, 2026
epaper

గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ సెంటర్ గా హైదరాబాద్​ : సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్ : ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్​ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. 23 సంవత్సరాల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరంగా గుర్తింపు ఉండేదన్నారు. మంగళవారం హైదరాబాద్​ ఇంటర్నేషనల్ కన్వెన్షన్​ సెంటర్ (HICC)​ లో నిర్వహించిన బయోఏషియా సదస్సు (BioAsia 2026) కు సీఎం హాజరై మాట్లాడారు. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతతో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు సీఎం (CM Revanth Reddy) వెల్లడించారు.

దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించి.. జీనోమ్ వ్యాలీని విస్తరించామని చెప్పారు. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు “వన్-బయో” ను ప్రారంభించామన్నారు. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేసి అనేక ప్రపంచస్థాయి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని సీఎం వెల్లడించారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని.. దృడమైన దృష్టి ఫలితమని దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయోఏషియా సదస్సు అని తెలిపారు. బయోఏషియా.. బయో – వరల్డ్​ గా మారుతోందన్నారు. సైన్స్​, ఏఐ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుంది అన్న నమ్మకం ఉందన్నారు.
తెలంగాణ రైజింగ్​ – 2047 విజన్​ లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్​, 2047 నాటికి మూడు ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యం అని సీఎం తెలిపారు.
పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు , ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం ఉందన్నారు. బల్క్ డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందని వెల్లడించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో తెలంగాణ పోటీ పడుతోందని సీఎం అన్నారు. కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా నుండి ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుంది సీఎం రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>