పేదలకు ఇక భూములివ్వలేం : సీఎం రేవంత్‌రెడ్డి

కలం, తెలంగాణ బ్యూరో: దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఇకపైన ప్రభుత్వం భూములు ఇవ్వడం కుదరదని, ఇవ్వాలన్నా ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తేల్చి చెప్పారు. ప్రభుత్వం భూములు ఇచ్చే కాలం పోయిందని, ఆ శకం ముగిసిందన్నారు. ప్రభుత్వం నుంచి భూములు ఆశించే ఆలోచనను మానుకోవాలని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి జాగీర్‌దార్లు, భూస్వాముల దగ్గర ఉన్న భూముల్ని తీసుకుని పేదలకు అసైన్‌మెంట్ పట్టా పేరుతో పంచిపెట్టిందని, అది ఆ కాలంలో సాధ్యంమైందని, ఇప్పుడు సాధ్యంకాదని అన్నారు.

అప్పట్లో దాదాపు 25 లక్షల ఎకరాలు పంచినా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు మిగల్లేదన్నారు. భూముల గురించి ఆలోచన చేయకుండా సంక్షేమం గురించి ఆలోచించాలని కోరారు. సంత్ సేవాలాల్ (Sant Sevalal) జయంతి సందర్భంగా బంజారాహిల్స్ గిరిజన సంక్షేమ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పై క్లారిటీ ఇచ్చారు.

చదువుకోడానికి ఎంతైనా అందిస్తాం :

పేద గిరిజనులు చదువుకుని వృద్ధిలోకి రావడానికి ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలైనా కల్పిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రతీ తండాకు ఒక పాఠశాల, బీటీ రోడ్ ఉండాల్సిందేనని నొక్కిచెప్పిన ఆయన సంబంధిత అధికారులకు ఆ వేదిక నుంచే ఆదేశాలు జారీచేశారు. గత ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసినా సొంత భవనాలు లేవని, ఇప్పుడు వాటి నిర్మాణానికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథకు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినా ఇప్పటికీ మారుమూల గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో తాగడానికి నీరు లేదని, కరెంటు కూడా లేని తండాలు చాలా ఉన్నాయన్నారు. వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే వ్యవసాయ మోటారు పంపుసెట్లను సోలార్‌లోకి కన్వర్ట్ చేస్తున్నట్లు వివరించారు.

అచ్చంపేట (Achampet) అసెంబ్లీ సెగ్మెంట్‌ను పైలట్‌గా ఎంచుకుని సుమారు 40 వేల సోలార్ పంపుసెట్లు వినియోగంలోకి రానున్నాయన్నారు. సంక్షేమంతో పాటు చదువును ఇవ్వాలనుకుంటున్నదని, చదువుకోడానికి ఏం కావాలో అడగాలని కోరారు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లు అవుతారో.. లేక దేశాన్ని ఏలడానికి ఏమవుతారో చెప్తే మద్దతు ఇస్తామన్నారు. కానీ ఇంటి దగ్గరే ఉంటాం.. భూమి ఇవ్వండి.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామనే ఆలోచనను వదిలేయాల్సిందేనన్నారు.

Read Also: ప్రజాభవన్ కు చేరిన జగిత్యాల పంచాయితీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>