కలం, వెబ్ డెస్క్ : ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్ష నిర్వహిస్తారని, కార్యదర్శులు తప్పనిసరిగా నెలవారీ రిపోర్ట్ సమర్పించాలన్నారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి తానే స్వయంగా పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం కొన్ని కీలక విజయాలు సాధించిందని, అలాగే భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకున్నామని సీఎం తెలిపారు.
గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ వంటి కీలక శాఖలకు స్పష్టమైన పాలసీలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. అందుకే ముఖ్యమైన అన్ని విభాగాలకు ఒక సమగ్ర పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. రాష్ట్రానికి ఒక దిశ, ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్(Telangana Document Vision) విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు.
స్పష్టమైన విధి విధానాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎంత గొప్ప కార్యాచరణ రూపొందించినా అధికారుల సహకారం లేకుండా ఫలితాలు రావని స్పష్టం చేశారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని హెచ్చరించారు. సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని, అభివృద్ధి కార్యక్రమాల అమలులో శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని రేవంత్(Revanth Reddy) ఆదేశించారు.
Read Also: ప్రతి పైసా ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం : భట్టి
Follow Us On: Instagram


