పోలీసులకు సైబర్ క్రైమ్ శిక్షణ : శాఖలో కొత్త సంస్కరణలు!

కలం, తెలంగాణ బ్యూరో : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావం కూడా మారుతున్నదని, డిజిటల్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో దాన్ని వాడుకునే నేరాలు పెరిగిపోయాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. సైబర్ క్రైమ్‌ రేటు, తీవ్రత పెరిగిపోతున్నదని, డిజిటల్ నాలెడ్జిపై సంపూర్ణ అవగాహనలేని అమాయకులు వారి కష్టార్జితాన్ని కోల్పోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపైన పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్, ట్రెయినింగ్ టైమ్‌లోనే సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలన్న నిబంధన, అవసరంతోనే సెలక్షన్స్ జరగాలని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ నియంత్రణ మీద లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. సైబర్ క్రైమ్ నివారణ, నియంత్రణకు అనుగుణంగానే ఫోరెన్సిక్ సెంటర్స్, డేటా సెంటర్లని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ అంశం మీద పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్సును ఏర్పాటు చేయాలన్నారు.

విజిలెన్స్ విభాగానికి మరిన్ని అధికారాలు :

పోలీసు శాఖలోని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం బాగా పెరగాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచించారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతికతను మరింతగా పెంచాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారిపైన విజిలెన్స్ దృష్టి మరింతగా పెరగాలన్నారు. డేటా అనాలిస్ ఆధారంగా ఆర్గనైజ్ క్రైమ్ మీద విజిలెన్స్ విభాగం దృష్టి సారించాలని సూచించారు. విజిలెన్స్ విభాగానికి మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంమీద అధ్యయనం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్‌మెంటులో ఎస్ఐ స్థాయి నుంచి నాన్-క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తరవాత కనీసంగా రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లో పని చేయాలని ఈ రివ్యూలో అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో మరింత రెస్పాన్సిబిలిటీ పెరగాలని, వ్యవస్థలో అందరూ భాగస్వాములేనని, దాన్ని కాదని వెళ్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. అలాంటి అధికారులను ప్రభుత్వం ఒప్పుకోదని స్పష్టం చేశారు.

పోలీస్ డిపార్టుమెంటు అప్‌గ్రేడ్ కావాలి :

పోలీసు శాఖలో ఎవరైనా హెడ్ క్వార్టర్స్ వదలాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిరంతరం క్రైమ్ రివ్యూ మీటింగ్స్ తప్పనిసరిగా పెట్టుకుంటూ శాఖ పటిష్టంగా పనిచేసేలా సమన్వయం ఉండాలన్నారు. జిల్లాల ఎస్పీలు నిరంతరం జిల్లాల్లో పర్యటించాలన్నారు. ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రౌడీషీటర్లపైన నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. నేరాల స్వభావం, టెక్నాలజీ బేస్డ్‌గా అప్‌గ్రేడ్ అవుతున్నట్లుగానే పోలీసింగ్ కూడా అప్‌డేట్ కావాలన్నారు. పోలీస్ డిపార్టుమెంట్‌లో అన్ని వాహనాలూ ఈవీ వైపు మారాలన్నారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోనని స్పష్టం చేశారు. కాలంచెల్లిన ఆయుధాలను తొలగించాలని, పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని, విలేజ్ పోలీసింగ్‌ను కూడా ఇంప్రూవ్ చేయాలన్నారు.

పదేళ్ళ భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవాలి :

రాష్ట్రంలో రౌడీ షీట్, హిస్టరీ షీట్‌లపైన సంబంధిత విభాగాల అధికారులు రివ్యూ చేయాలని సీఎం సూచించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విభాగాన్ని కూడా బలోపేతం చేసుకోవాలన్నారు. రాబోయే పదేళ్ల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా డిపార్టుమెంట్ సిద్ధం కావాలన్నారు. అదే సమయంలో పోలీసు సిబ్బంది సంక్షేమంపైనా దృష్టి పెట్టాలన్నారు. విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న డ్రోన్‌లను వాడుకోవాలని, పోలీసింగ్ పెంచాలన్నారు. పోలీసింగ్‌లో కూడా టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. సీసీ కెమెరాలను పెంచుకోవాలని, నేర దర్యాప్తులో అవి కీలక భూమిక పోషిస్తాయన్నారు. ఇందుకోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీస్ డిపార్టుమెంట్‌లో అవినీతిని సహించనని తేల్చి చెప్పారు. మెరిట్ ప్రకారమే పోస్టింగ్స్ ఉండాలని, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం పెరగాలన్నారు. ఈ డిపార్టుమెంట్ బలోపేతం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

అన్ని పోలీసు స్టేషన్లలో క్య ఆర్ కోడ్ :

ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచుకోవడానికి కేంద్రం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని గుర్తుచేసిన సీఎం.. అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల కోసం క్యూ ఆర్ కోడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్‌ను ఒకే యూనిట్ చేయాలన్నారు. ఆహార పదార్ధాల కల్తీపై ఉక్కుపాదం మోపాలని, ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయన్నారు. వీఐపీలు, సెలబ్రిటీల కార్యక్రమాల అనుమతులపైనా జాగ్రతలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ఫైర్ డిపార్టుమెంటు, నాలాల నిర్వహణతో పాటు మ్యాన్‌హోల్స్ విషయంలో జలమండలి, మున్సిపల్ డిపార్టుమెంటు, హైడ్రా సమన్వయం చేసుకుని జూన్ 15కల్లా నివేదిక సిద్ధం చేయాలన్నారు.

అడ్డగోలు ఫ్లెక్సీలకు అడ్డుకట్ట వేయాల్సిందే :

హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా ఫెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మున్సిపల్ అధికారుల మీద ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఫెక్సీలను నియంత్రించాల్సిందేనని, పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయంలో కఠినంగా ఉండాలన్నారు. శాంతిభద్రతల నిర్వహణతో పాటు బైక్ రేసింగ్, నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళల భద్రత తదితరాల కోసం నైట్ పెట్రోలింగ్‌ను మరింతగా పెంచాలన్నారు. గంజాయి రవాణాను అరికట్టాలని, ఇందుకోసం ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పోలీసు డిపార్టుమెంటుపై రివ్యూలో స్టేట్ సెక్యూరిటీ అడ్వయిజర్ శివధర్‌రెడ్డి, హోం కార్యదర్శి శిఖా గోయల్, డీజీపీ సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్లు, డిపార్టుమెంటు హెడ్‌లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>