కలం, తెలంగాణ బ్యూరో : ఎల్‌పీజీ నినాదంతో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) చరిత్రను మలుపు తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. 1990 నుండి 2021 వరకు మరో శకం అని పేర్కొన్న సీఎం.. మన తెలంగాణ బిడ్డ, భారతరత్న పీవీ నర్సింహారావు నాయకత్వంలో 1990లో మరో శకం ప్రారంభమైన విషయం మనకు తెలుసు. ఆ నాడు సంక్షోభం నుంచి సంస్కరణల వైపు భారత్ అడుగులు వేసిందని సీఎం ప్రశంసించారు. కేవలం రెండు వారాలకు మాత్రమే సరిపోయే స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్న అత్యంత సంక్షోభ సందర్భంలో పీవీ నర్సింహారావు ఈ దేశ పాలనా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. బంగారాన్ని కుదువ పెట్టే పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక చరిత్రను మరో మలుపు తిప్పిన చాణక్యుడు పీవీ అని రేవంత్ అసెంబ్లీలో కొనియాడారు.
“లిబరలైజేషన్ – ప్రైవేటైజేషన్ – గ్లోబలైజేషన్ షార్ట్ పేరుతో…LPG (Liberalization – Privatization – globalization) నినాదంతో ఆర్థిక సంస్కరణలకు పీవీ శ్రీకారం చుట్టారు. భారతదేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేశారు. ఆయన హయాంలోనే లైసెన్స్ రాజ్ కు మనం ముగింపు పలికాం. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతులను పెంచడం కోసం అత్యంత సాహసోపేతంగా రూపాయి విలువను తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ఆటో, టెలికాం రంగాల్లో విదేశీ పెట్టుబడులు, కంపెనీలకు గేట్లు తెరిచారు. పబ్లిక్ సెక్టార్ ను పరిమితం చేస్తూ, ప్రైవేటుకు ప్రాధాన్యత ఇస్తూ 1991 లో కొత్త పారిశ్రామిక విధానం ప్రవేశ పెట్టారు. లుక్ ఈస్ట్ (Look East) పేరుతో పాలసీ తీసుకువచ్చారు. ఈ సంస్కరణలే దేశంలో టెలికాం, ఐటీ విప్లవానికి కారణం అయ్యాయి. భారతదేశం క్లోజ్డ్ ఎకానమీ నుండి ఓపెన్ ఎకానమీగా మారింది. ఐటీ, సర్వీసు రంగాలకు స్వర్ణయుగం మొదలైంది. ఆ రకంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ రీఫార్మ్స్ (Father of Indian economic reforms) గా పీవీ నర్సింహారావు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.’ అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.
Read Also: పార్లమెంట్ టు అసెంబ్లీ… సీఎం బిజీ షెడ్యూల్
Follow Us On: Facebook

