టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు.. శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేటు ఇంటర్నెట్ కంపెనీల నుంచి తీసుకునే కనెక్షన్లు ఈ నెల చివరి వరకే కొనసాగనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి అలాంటివి బంద్ కానున్నాయి. దీనికి బదులుగా అన్ని ప్రభుత్వ ఆఫీసులకు టీ-ఫైబర్ (T Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం కొన్ని ఆఫీసులు ప్రైవేటు సంస్థల నుంచి ఇంటర్నెట్ (బ్రాడ్ బ్యాండ్) కనెక్షన్లు తీసుకున్నందున అవి ఈ నెల చివరితో ముగుస్తాయని, వచ్చే నెల నుంచి బిల్లుల పేమెంట్ ఉండదని ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. టీ-ఫైబర్ సేవల విస్తరణపై సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్ణీత గడువులోగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు.

యూనిఫామ్ డిజిటల్ నెట్‌వర్క్

– ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రజాధనాన్ని ఆదా చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. యూనిఫామ్ (ఏకీకృత) డిజిటల్ నెట్‌వర్క్ ఏర్పాటు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
– ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలు వినియోగిస్తున్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ నెల రోజుల వ్యవధిలో పూర్తిగా టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన గడువు విధించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
– భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
– ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Also Read : రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>