కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాలుష్య నివారణ కోసం నగరంలో రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ (Hyderabad)లో 2500 ఆర్టీసీ డీజీల్ బస్సులు నిత్యం కాలుష్యం వెదజల్లుతున్నాయని, డిసెంబర్ లోపల వాటిని జిల్లాలకు తరలించి ఈవీ బస్సులను తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈవీ వెహికిల్స్‌కు జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించబోతున్నట్లు సీఎం వెల్లడించారు.
పొలిటికల్ క్యాపిటల్‌గా ఉన్న ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల ఇబ్బందిపడుతోందని సీఎం చెప్పారు. ముంబయి కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోందని, చైన్నైలో వరదల సమస్య ఉందని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలోని మెట్రో పాలిటన్ సిటీల్లో హైదరాబాద్ అన్నింటికంటే బెస్ట్ అని చెప్పారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని సీఎం కొనియాడారు. ప్రపంచంలోని నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని వెల్లడించారు. సౌత్ కొరియా, న్యూయార్క్, టోక్యో తో హైదరాబాద్ పోటీ పడేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తెలంగాణను 2047 నాటికి ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయని, 200 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న రాష్ట్రాన్ని 8 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడం కోసం పని చేస్తున్నామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించినట్లు సీఎం (Revanth Reddy) తెలిపారు. 1.30 కోటి జనాభా ఉన్న క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ గా మారుస్తామని ప్రకటించారు.
Read Also: నా ఇద్దరు కుమారులను అలా పెంచుతా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Follow Us On: Sharechat

