కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతాంగానికి శుభవార్త అందుతోంది. మరికాసేపట్లో రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా తొలుత సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మాగారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ‘ప్రజా పాలన – రైతు ఉత్సవాలు’ కార్యక్రమంలో పాల్గొని ఆయిల్ ఫాం కర్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చారు. ఈ క్రమంలోనే రిఫైనరీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
అలాగే సిద్దిపేట జిల్లాలో మొత్తం 775.72 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 475.72 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రైతు మేళా ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మరికాసేపట్లో బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. 1.50 కోట్ల ఎకరాలకు సాయం కింద రూ. 9 కోట్లు విడుదల చేస్తారు. ఈ నగదు ఆదివారం ఆర్బీఐ నుంచి బ్యాంకుల్లోకి చేరనున్నాయి. నేడు ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతన్నల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.

