కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ చీరల’ (Indiramma Sarees) కొత్త డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క, మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ విజయ లక్ష్మి తదితరులతో కలిసి ఆయన సరికొత్త ఇందిరమ్మ డిజైన్ లను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళను ప్రభుత్వం తన సొంత సోదరిలా భావిస్తోందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందన్నారు. ఆడబిడ్డలు తమ పుట్టింటి వారు పంపిన చీరలను ఎంత సంతోషంగా కట్టుకుంటారో, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఇందిరమ్మ చీరలను కూడా తెలంగాణ మహిళలు అంతే గర్వంగా ధరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఉత్పత్తి పరమైన కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పట్టణ ప్రాంతాల్లో చీరల పంపిణీ కాస్త ఆలస్యమైందన్న సీఎం.. ఆ ఆలస్యాన్ని అధిగమించి మంత్రి సీతక్క పర్యవేక్షణలో త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

