కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ముస్లిం ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి రంజాన్ (Ramzan) శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. క్రమశిక్షణతో చేసే ప్రార్థనలు, ధాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మైనార్టీ విద్యార్థులకు చక్కటి విద్యను అందజేస్తామని చెప్పారు. అటు ముస్లింలకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఖురాన్ సన్మార్గంలో నడిపిస్తూ మానవత్వం, కరుణకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంజాన్ (Ramzan) శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాస ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్’ సందర్భంగా ముస్లిం సహోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా-జమున తహజీబ్‌కు ప్రతీకగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని అభిప్రాయపడ్డారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.

